శబరిమల ఆలయంలోకి వెళ్లాలనుకున్న తనను అడ్డుకున్నారని కేరళకు చెందిన ఓ మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా తనను అడ్డుకున్నారని పిటిషనర్ పేర్కొంది. ఆమె వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయస్థానం.. వచ్చే వారం వాదనలు వింటామని తెలిపింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పిటిషన్ను ప్రస్తావించారు మహిళ తరఫు సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు విరుద్ధంగా మహిళను అడ్డుకున్నారని... ఆమెకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు కొలిన్.
ఇటీవల మహిళా కార్యకర్తలు బిందు అమ్మిని, ఫాతిమాలు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భక్తులు వారిని అడ్డుకున్నారు.
ఎన్నికల బాండ్ల నిలిపివేతపైనా..
ఎన్నికల బాండ్ల పథకంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్ విచారణకూ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. వచ్చే నెలలో విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. లంచం, మనీలాండరింగ్, నల్లధనం వ్యాప్తి వంటి వాటికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఆరోపించారు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. అధికారంలో ఉన్న పార్టీ ఈ పథకాన్ని దుర్వినియోగపరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అప్పు కోసం బ్యాంక్లో తుపాకీతో వీరంగం