ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులలో ప్రత్యేక కోటా కల్పించాలని దాఖలైన పిటినషన్లపై జనవరిలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగుల పదోన్నతులకు గతంలో ధర్మాసనం ఇచ్చిన 'స్టేటస్ కో' విఘాతంగా మారిందని బిహార్, మధ్యప్రదేశ్, త్రిపుర తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ వ్యాజ్యాలను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం... జనవరి 28 నుంచి వాదనలు ఆలకిస్తామని తెలిపింది.
వందలాది ఖాళీలు
ఈ అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం స్వల్పంగా వాదనలు జరిగాయి. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన వందలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ పట్వాలియా కోర్టుకు వివరించారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్ల తరఫున పట్వాలియా వాదిస్తున్నారు.
గత సంవత్సరం తీర్పు
ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, కళాశాల ప్రవేశాలు సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పొందరాదని 2018లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కేంద్రం సుప్రీంను ఇటీవలే కోరింది. పునఃపరిశీలన నిమిత్తం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలని అభ్యర్థించింది.