అయోధ్య కేసులో వెలువడిన తీర్పుపై రివ్యూ పిటిషన్లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణకు చేపట్టాలా? లేదా?... అనే అంశంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం నేడు అంతర్గత విచారణ చేపట్టనుంది. బహిరంగ విచారణకు సుప్రీంకోర్టు మొగ్గుచూపితే అన్ని రివ్యూ పిటిషన్లు విచారణకు రానున్నాయి. వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయించినట్లయితే.. అన్ని రివ్యూ పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చే అవకాశం ఉంది. రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదం కేసులో నవంబర్ 9న సుప్రీం కోర్టు తీర్పును పునః సమీక్షించాలంటూ ఇప్పటివరకూ ఏడు పిటిషన్‌లు సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు వచ్చాయి.
అయోధ్య తీర్పును సవాల్ చేస్తూ 40 మంది సామాజిక కార్యకర్తలు సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది.
ఇదీ చూడండి: లోక్సభ ముందుకు వృద్ధుల సంక్షేమ చట్ట సవరణ బిల్లు