ఏ ప్రాతిపదికన.. కొవిడ్ చికిత్సకు ఆయుర్వేద పద్ధతులకు అనుమతించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కొవిడ్ చికిత్స విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
అంతకుముందు.. రోగ నిరోధక శక్తిని అందించేందుకు మాత్రమే ఆయుర్వేద మందులను వినియోగించాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా చికిత్సకు కాదని స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయుష్ వైద్యులు. జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎమ్ఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఆయుర్వేద మందులను వినియోగించడంపై ఏమైనా మార్గదర్శకాలు జారీ చేశారా? అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది సుప్రీం.
దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్... రోగ నిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే ఆయిర్వేద మందులను వాడతామని నివేదించారు. అయితే.. ఈ విషయంలో మార్గదర్శకాలను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది ధర్మాసనం.