లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేని ప్రైవేటు సంస్థలపై జులై చివరి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది సుప్రీం కోర్టు. లాక్డౌన్ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ.. పలు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ మేరకు తీర్పు వెలువరించింది.
వేతనాల సమస్యపై యాజమాన్యాలు, ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరింది. దానికి సంబంధించిన పూర్తి నివేదికను లేబర్ కమిషనర్లకు సమర్పించాలని స్పష్టం చేసింది.
చర్యలొద్దు..
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వేతనాలు చెల్లించని కంపెనీలపై బలవంతపు చర్యలు వద్దని స్పష్టం చేసింది ధర్మాసనం. మార్చి 29న కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల చట్టబద్ధతపై నాలుగు వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు విధించిన 54రోజుల లాక్డౌన్ కాలంలో ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి కోతలు విధించకూడదని.. అందరికీ పూర్తి జీతం చెల్లించాలని కేంద్రం ఇటీవలే స్పష్టం చేసింది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలకు వ్యతిరేకంగా పలు ప్రైవేటు కంపెనీలు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి.
తదుపరి విచారణను జులై చివరి వారానికి వాయిదా వేసింది ధర్మాసనం.