నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనల విషయంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం ప్రవర్తన పట్ల తీవ్ర నిరాశ చెందినట్టు వ్యాఖ్యానించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. సమస్యను పరిష్కరించేందుకు మాజీ సీజేఏ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చట్టాల అమలును కొంతకాలం నిలిపివేస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చినట్టు.. అవసరమైతే ఈ చట్టాలపై స్టే విధించేందుకు కూడా వెనుకాడమని స్పష్టం చేసింది.
సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
"కేంద్రం.. వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేయకపోతే మేమే స్టే విధిస్తాం. రోజురోజుకు పరిస్థితి దిగజారుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఆందోళనల్లో పాల్గొన్న కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అసలేం జరుగుతోంది? శాంతియుత పరిస్థితులు విచ్ఛిన్నమయ్యే ప్రమాదముంది.
ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైతుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరాశతో ఉన్నాం. చట్టాలు ప్రయోజకరమేనని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ కూడా కనిపించడం లేదు. సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. రైతులు ఇబ్బందులను కమిటీకి చెప్తే.. ఆ నివేదికను పరిశీలిస్తాం.
భారత ప్రధాన న్యాయమూర్తిగా చెబుతున్నా రైతులారా.. మీరు ఇళ్లకు వెళ్లండి. కమిటీ.. మీ సమస్యను పరిష్కరిస్తుంది."
- సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే
చట్టాల్ని నిలిపివేయడం సాధ్యం కాదు..
అయితే చట్టాలను నిలిపివేయడం కుదరదని, దీనిపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయొచ్చని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు.
"ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు న్యాయస్థానాలకు లేదు. సుప్రీం గత తీర్పులు కూడా ఇదే చెబుతున్నాయి. అంతేగాక కొత్త చట్టాలపై యావత్ దేశం సంతృప్తిగా ఉంది. కేవలం రెండు, మూడు రాష్ట్రాల వారు ఆందోళన చేస్తున్నారు."
- సుప్రీంతో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్
మంగళవారం తీర్పు...
కమిటీకి నేతృత్వం వహించేందుకు మాజీ సీజేఐ జస్టిస్ ఆర్ఎమ్ లోధా సహా కొంతమంది పేర్లను సీజేఐ ప్రతిపాదించారు. కమిటీలో సభ్యుల కోసం మాజీ సీజేలు, జడ్జిల పేర్లు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్‌ను సుప్రీంకోర్టు కోరింది. ఇందుకు ప్రతిగా జాబితా మంగళవారం అందజేస్తామని తెలిపారు సొలిసిటర్ జనరల్. ఇప్పుడు ఇవ్వడానికి ఏమైందని, ఈ విషయాన్ని ఇంకా కొనసాగించదలచుకోలేదని సుప్రీంకోర్టు.. సొలిసిటర్ జనరల్‌కు తేల్చిచెప్పింది.
అనంతరం సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై మంగళవారం తీర్పును వెలువరించనున్నట్టు స్పష్టం చేసి విచారణను వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటుపైనా మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది.