ఏడో దశ పోలింగ్ సమయాన్ని మార్చాలని దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ను వేసవి ఎండ, రంజాన్ మాసం సందర్భంగా... ఐదున్నర గంటలకే ప్రారంభించే విధంగా ఈసీని ఆదేశించాలని న్యాయవాది మహ్మద్ నిజాముద్దిన్ పాషా వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌కు సమయముందని, ఓటర్లు ఉదయమే ఓటుహక్కు వినియోగించుకోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాన్ని ముందుకు జరిపితే ఈసీ ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
సమయాన్ని మార్చే అంశంపై నిజాముద్దిన్ ముందుగా దిల్లీ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు మే 2న ఎన్నికల సంఘం అభిప్రాయం కోరింది. సమయాన్ని ముందుకు జరపడం సాధ్యం కాదని 5న సమాధానమిచ్చింది ఈసీ. ఈ వ్యాజ్యంపై పిటిషనర్ సుప్రీంను ఆశ్రయించారు.
తాజా పిటిషన్‌లోని అంశాలు
ఈసీ మే 5న ఇచ్చిన సమాధానం వివాదాస్పదంగా ఉందన్నారు నిజాముద్దిన్ పాషా. ఇప్పటికే వాతావరణ శాఖ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వర్గం వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు పిటిషనర్.
ఇదీ చూడండి: ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదంపై 17న విచారణ