కరోనా వైరస్ సెగ సుప్రీంకోర్టును తాకింది. న్యాయస్థానం మూసివేతకు యోచిస్తున్నట్లు చెప్పారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నట్లు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చేసిన అభ్యర్థన మేరకు సుప్రీం కార్యకలాపాలు రద్దు చేసే అంశమై స్పష్టత ఇచ్చారు సీజేఐ.
న్యాయవాదులకు నో ఎంట్రీ..
న్యాయవాదులు కోర్టు ఆవరణలోకి ప్రవేశించకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు జస్టిస్ బోబ్డే. ఇందుకోసం వారికి జారీ చేసిన అన్ని రకాల అనుమతి పత్రాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరంగా కోర్టుకు వెళ్లాలనుకునే న్యాయవాదులు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్ అనుమతితో మాత్రమే రావాలని తేల్చి చెప్పారు.
ఛాంబర్లు మూసివేత
సుప్రీం కోర్టు ఆవరణలోని న్యాయవాదుల ఛాంబర్లను మంగళవారం సాయంత్రంలోగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు సీజేఐ. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సుప్రీం ఆవరణలోకి రావొద్దని న్యాయవాదులకు సూచించారు.
న్యాయవాదుల నుంచి వస్తోన్న డిమాండ్ల మేరకు సుప్రీంకోర్టును మూసివేయడం లేదా వేసవి సెలవులను ముందస్తుగా ఇవ్వడమై నేడు ప్రకటన చేస్తామని వెల్లడించారు సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే.
ఇదీ చూడండి: 'ఇంటి నుంచి బయటకు వస్తే ఇక అంతే'