కరోనా వైరస్ ఉద్ధృతి పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని న్యాయస్థానాల్లోనూ... వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయవిచారణలు చేపట్టాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. కొవిడ్-19 నియంత్రణలో భాగంగా న్యాయవాదులు సామాజిక దూరం పాటించాలని హితవు పలికింది.
ప్లీనరీ అధికారంతో..
మార్చి 25 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అత్యవసర కేసుల విచారణను చేపడుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు తన ప్లీనరీ అధికారాన్ని ఉపయోగించుకుంటూ.... అన్ని కోర్టులు న్యాయవిచారణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అదేశాలు జారీ చేసింది.
సుమోటో
న్యాయస్థానాల్లో విచారణలను నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. కోర్టులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఫిర్యాదులు స్వీకరించడానికి హెల్ప్లైన్లు ఏర్పాటుచేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
ఇదీ చూడండి: కరోనాపై పోరు: భారత్కు అమెరికా భారీ ఆర్థిక సాయం