సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేను ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు కలిశారన్న వార్తలను ఖండించింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేస్తోన్న అంతర్గత కమిటీకి జస్టిస్ బాబ్డే నేతృత్వం వహిస్తున్నారు.
ఓ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలను పూర్తి తప్పుగా పేర్కొంటూ.. సుప్రీం కోర్టు ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. సీజేఐపై వచ్చిన ఆరోపణల్లో అంతర్గత కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కమిటీ ఏ ఇతర న్యాయమూర్తుల నుంచి సమాచారం తీసుకోదని ప్రకటనలో తెలిపారు.
జస్టిస్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు జస్టిస్ బాబ్డేను కలిసి... ముగ్గురు సభ్యుల కమిటీ ఏకపక్షంగా ముందుకు వెళ్లకూడదని కోరినట్లు ప్రచురించింది పత్రిక. అంతర్గత కమిటీకి సహకరించేందుకు ప్రత్యేక న్యాయవాదిని నియమించాలని సలహా ఇచ్చినట్లు కథనంలో పేర్కొంది.
సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసుని విచారిస్తున్న అంతర్గత కమిటీలో జస్టిస్ బాబ్డేతో పాటు మరో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ ఇందు మల్హోత్ర, జస్టిస్ ఇందిర బెనర్జీ ఉన్నారు.
ఇదీ చూడండి: "రాజీవ్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు బాధించాయి"