దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు ఆందోళనకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కూలీలకు ఉపశమనం కల్పించేలా ప్రభుత్వాలు కొన్ని చర్యల్ని చేపట్టినా వాటిలో లోటుపాట్లు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత తీసుకుని వీరికి ఉచితంగా తగిన రవాణా, ఆహారం, వసతి సదుపాయాలను వెంటనే కల్పించాలని ఆదేశించింది. తక్షణమే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐదు సూచనలు జారీ చేసింది.
- వలస కార్మికుల నుంచి రైల్వే, బస్సు ఛార్జీలను వసూలు చేయవద్దు. రైల్వే ప్రయాణ ఖర్చులను రాష్ట్రాలు పంచుకోవాలి.
- ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలకు ఆహారం, ఆశ్రయం కల్పించాలి. వారికి ప్రయాణ ఏర్పాట్ల గురించి సమాచారం ఇవ్వాలి.
- బస్సు, రైల్వే ప్రయాణ రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వాాలే చూసుకోవాలి. వీలైనంత త్వరగా రవాణా ఏర్పాటు చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వలస కార్మికులను గమ్యానికి చేర్చే బాధ్యత రాష్ట్రాలదే.
- వలస కార్మికులకు సంబంధించిన వివరాలను తెలియజేయాలి.
వాదనలు..
'వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడం, వారికి ఆహారం సమకూర్చడంలో చాలా పెద్ద సమస్య ఉత్పన్నమైంది. అనేకమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కొన్ని వారాల పాటు వారెందుకు ప్రయాణానికి నిరీక్షించాల్సి వచ్చింది? తమ కోసం డబ్బులేమైనా ఖర్చు పెట్టాలని అడుగుతున్నారా? రాష్ట్రాలు ఎలా చెల్లిస్తున్నాయి?' అని కేంద్రం తరఫు న్యాయవాదిని సుప్రీం ప్రశ్నించింది. అలాగే, ఒకే సమయంలో అందరినీ స్వస్థలాలకు చేర్చలేకపోయినా.. వాళ్లు రైళ్లలో తమ ఇళ్లకు చేరే వరకు ఆహారం, ఆశ్రయం తప్పకుండా కల్పించాల్సింది కదా అని వ్యాఖ్యానించింది.
దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా ఇప్పటివరకు దాదాపు 91 లక్షల మందిని ఆయా రాష్ట్రాలకు తరలించామని బదులిచ్చారు. అలాగే, గత కొన్ని రోజుల నుంచి రైల్వేశాఖ 84 లక్షల భోజనాలను సమకూర్చిందని వివరించారు. చిట్టచివరి వలస కూలీని సైతం స్వస్థలాలకు చేర్చే వరకూ శ్రామిక్ ప్రత్యేక రైళ్ల సేవలను కేంద్రం కొనసాగిస్తుందని కోర్టుకు తెలిపారు.
వాదనల అనంతరం తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.