ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ ఫిర్యాదులపై సోమవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
మోదీ, అమిత్‌షాపై ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
తమకు అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని, మిగతా 9 ఫిర్యాదులపై స్పందించేందుకు సమయం కావాలని ఈసీ కోరింది. సోమవారం వరకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'ఫొని'పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష