కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి సత్పాల్ మహారాజ్‌కు కొవిడ్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఆయనతో పాటు నలుగురు కుటుంబ సభ్యులకూ వైరస్ నిర్ధరణయింది. మంత్రి కుమారుడు, కోడలు వైరస్ బారినపడ్డట్లు సమాచారం.
మొత్తం 41మంది నమూనాలు పరీక్షలకు పంపగా మంత్రి సహా ఆయన కుటుంబంలోని నలుగురికి, మరో 17మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో మంత్రి నివాసంలో పనిచేసేవారు, ఇతర సిబ్బంది ఉన్నారు.
సచివాలయానికి...
రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరైన సత్పాల్కు వైరస్ సోకడం వల్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. సమావేశం రోజు అయనతో పలువురు అధికారులు, సిబ్బంది సన్నిహతంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర సచివాలయంలో కరోనా కలవరం మొదలైంది.
ఇప్పటికే సత్పాల్ మహారాజ్ సతీమణి, మాజీ మంత్రి అమృత రావత్ కరోనా బారిన పడ్డారు. దెహ్రాదూన్‌లోని మంత్రి నివాసంలో కుటుంబ సభ్యులందరూ హోంక్వారంటైన్లోకి వెళ్లారు.
ఉత్తరాఖండ్‌లో కొత్తగా నమోదైన 33 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 749కి చేరింది.