తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ జనవరి 27న ఉదయం జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తవుతున్నందున ఆమె విడుదలవుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని శశికళ న్యాయవాది రాజా సెంథూర్ పాండ్యన్కు తెలియజేేశారు.
జైలు అధికారుల నుంచి శశికళ విడుదలకు సంబంధించిన సమాచారం అందిందని రాజా సెంథూర్ పాండ్యన్ వెల్లడించారు.
అక్రమార్జన కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదల చేస్తున్నారు.
ఈ కేసులో శశికళతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు. ఇందులో జయలలితకు రూ.100 కోట్లు, శశికళ సహా ఇతరులకు రూ.10 కోట్లు జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. రూ.10కోట్ల జరిమానాను శశికళ గతేడాది నవంబర్లోనే చెల్లించారు.
అయితే జైలు నుంచి విడుదలైన రోజే శశికళ చెన్నైకి వెళ్తుందా? లేదా? అనే విషయంపై స్పషత లేదు.
ఇదీ చదవండి: కోర్టుకు రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ