జమ్ముకశ్మీర్‌లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన కాంట్రాక్టులను తొలిసారిగా స్థానికేతరులు పొందారు. జీలం నది వెంటనున్న ఇసుక ర్యాంపుల కేటాయింపు కోసం అధికారులు గత ఏడాది సెప్టెంబరులో ఇ-టెండర్లను ఆహ్వానించగా స్థానికేతరులూ భారీగా పాల్గొన్నారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370 రద్దుతో ఇక్కడి టెండర్లలో ఇతర రాష్ట్రాల వారూ పాల్గొనే అవకాశం లభించింది.
స్థానికేతరులకే 70 శాతం..
స్థానిక గుత్తేదారులూ టెండర్లు దాఖలుచేసి కొన్ని స్థానికేతరులకు ఇసుక లీజులు ఇసుక ర్యాంపుల లీజులను దక్కించుకున్నారని భూగర్భ గనుల శాఖ జాయింట్ డైరెక్టర్ ఇంతియాజ్ ఖాన్ 'ఈటీవీ భారత్'కు తెలిపారు. అయితే, 70 శాతం ఇసుక ర్యాంపులు స్థానికేతరులకు, 30 శాతం మాత్రమే స్థానికులకు దక్కాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. శ్రీనగర్ జిల్లాలో ఇసుక క్షేత్రాలను 10 మంది స్థానికేతరులు పొందారు. మైనింగ్ లీజు గడువు అయిదేళ్లు. అధికరణం 370 రద్దుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారుతుందన్న ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతోంది. లీజులను దక్కించుకున్న ఇతర రాష్ట్రాల గుత్తేదారులు.. స్థానిక కూలీలను పనిలోకి తీసుకుంటారా అనే సందేహాలున్నాయి.
ఒకవేళ ఆ గుత్తేదారులు తమ రాష్ట్రం నుంచే కూలీలను తెచ్చుకుంటే స్థానికులు ఉపాధి కోల్పోతారని, మరోవైపున గుత్తేదారులు ఇష్టారీతిగా ఇసుక తవ్వకాలకు పాల్పడితే పర్యావరణ సమస్యలూ తలెత్తుతాయని సామాజిక కార్యకర్త రాజా ముజఫర్ 'ఈటీవీ భారత్' వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం ఇసుక తవ్వకాల్లో యంత్రాల వినియోగానికి అనుమతిలేదని, ఎవరైనా ఉల్లంఘిస్తే లీజు రద్దవుతుందని తెలిపారు. పర్యావరణ పరమైన జాగ్రత్తలూ నిబంధనల్లో ఉన్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'సరిహద్దు ఒప్పందానికి కట్టుబడి ఉందాం!'