ప్లాస్టిక్ భూతంపై అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. దేశ ప్రజలకు ఈ సందేశం అందించేందుకు వినాయక చతుర్థిని వేదికగా చేసుకున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలోని పూరి బీచ్‌లో 5 టన్నుల ఇసుకతో.. 10 అడుగుల ఎత్తయిన వినాయకుడి సైకత శిల్పం రూపొందించారు పట్నాయక్. దాని చుట్టూ 1000 ప్లాస్టిక్ బాటిళ్లను ఏర్పాటు చేశారు.
ఈ ఇసుక ఏకదంతుడి విగ్రహం ద్వారా ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించాలని సందేశం ఇచ్చారు సుదర్శన్. ' సే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్', ' సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్' అనే నినాదాలను ఇసుకపై రాశారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు తాను ఈ చిన్న ప్రయత్నం చేశానని పేర్కొన్నారు పట్నాయక్.
" ఈ ఏడాది గణేశ్ చతుర్థి సందర్భంగా ఒక్కసారి మాత్రమే వాడి పడేసే ప్లాస్టిక్‌ను తిరస్కరించాలని సందేశం ఇవ్వాలనుకున్నాను. ఇటీవలే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2 నుంచి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1000 ప్లాస్టిక్ బాటిళ్లతో సైకత శిల్పం తయారు చేశాను. పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నా. "
- సుదర్శన్ పట్నాయక్, సైకత శిల్పి.
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు పట్నాయక్. ఇటీవల సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యంతో భూమి ఎలా నాశనమవుతుందో తెలిపేలా చేసిన సైకత శిల్పానికి అమెరికాలో పీపుల్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. అదే తరహాలో గణేశ్ చతుర్థికి సందేశం ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: గోల్డెన్ గణేశ్... దేశంలోనే అత్యంత సంపన్నుడు!