ప్రేమ పెళ్లి చేసుకున్న మీనా అనే యువతి మానసిక స్థితి సరిగా లేని సమయం చూసి ఆమె తల్లిదండ్రులు రెండు నెలల పసికందును రూ. 3 లక్షలకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న మీనా ఎట్టకేలకు తన పుత్రుడిని కనిపెట్టింది.
ఇదీ జరిగింది
తమిళనాడు సాలెం జిల్లా నాయనంపట్టికి చెందిన పొన్నుస్వామి కుమార్తె మీనా, అదే ప్రాంతానికి చెందిన రాజాలు రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తిర్పూర్‌లో నివాసముంటూ రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలో పనిచేసేవారు.
ఏడాది కిందట మీనా ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో మీనా మానసిక అనారోగ్యానికి గురై కోయంబత్తూర్‌లోని ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మీనాను మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు చికిత్స జరుగుతున్న సమయంలోనే రెండు నెలల పసిగుడ్డును రూ. 3 లక్షలకు అమ్మేశారు. భర్తను వెళ్లగొట్టారు. మానసిక స్థితి మెరుగైన అనంతరం తన భర్త, చిన్నారి కోసం ఆరాతీసింది మీనా. అయితే కుమారుడిని, భర్తను మరచిపోవాలని ఆమె తల్లదండ్రులు సమాధానమిచ్చారు.
భర్త సాయంతో
తన కుమారుడు, భర్త ఆచూకీ కోసం తపించిన మీనా ఎలాగోలా భర్తను కలిసింది. అనంతరం నవంబర్ 18న జిల్లా కలెక్టర్‌ను కలసి తన కుమారుడి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసింది. మీనా ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ సత్వర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
విల్లుపురం జిల్లాలోని తిరువావలూరుకు చెందిన జంటవద్ద చిన్నారిని కనుగొన్న అధికారులు చైల్డ్ హోమ్‌కు తరలించారు. డీఎన్ఏ పరీక్షలు ముగిసిన అనంతరం అసలు తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగించనున్నారు.
ఇదీ చూడండి: ఆకట్టుకున్న చెన్నై 'మెగా వాల్ పెయింటింగ్ '