పాకిస్థాన్‌లోని తీవ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన భారత వైమానిక దళంపై ప్రశంసల వర్షం కురిపించింది ఆర్ఎస్ఎస్. మెరుపుదాడులకు అనుమతిస్తూ సరైన నిర్ణయం తీసుకుందంటూ మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.
ఉత్తర్‌ప్రదేశ్ గాల్వియర్‌లో జరుగుతున్న మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధుల సభ మొదటి రోజు ఈ మేరకు తీర్మానం చేసింది ఆర్ఎస్ఎస్. పాకిస్థాన్ యుద్ధ విమానాలతో ప్రాణాలకు తెగించి పోరాడిన అభినందన్‌ను ప్రశంసిస్తూ ప్రకటన విడుదల చేసింది. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించింది.
తీవ్రవాదులతో పోరాటానికి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొంది. భారత ప్రజలు ఇలాంటి దేశ దోహ్రుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. -ఆర్ఎస్ఎస్
భారత దేశ సహనాన్ని చేతకానితనంగా పరిగణించకూడదని హెచ్చరించింది ఆర్ఎస్ఎస్.
శబరిమల వివాదంపై...
శబరిమల వివాదంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అన్యమతస్థులను ఆలయంలోకి పంపి హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది.
రామ మందిరానికి ఏకాభిప్రాయం:
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ ధీమా వ్యక్తంచేసింది.
పర్యావరణ అంశాలపై చర్చ:
ఈ మూడు రోజుల చర్చల్లో రాజకీయ అంశాలతో పాటు పర్యావరణ అంశాలైన నీటి పొదుపు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటం, మొక్కల పెంపకంపై చర్చించనున్నారు.
అఖిల భారతీయ ప్రతినిధుల సమావేశానికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగత్ సహా 1400 మంది సభ్యులు హజరయ్యారు.