కరోనా వైరస్ వల్ల తలెత్తిన ప్రతికూల పరిస్ధితుల్లో దేశ ప్రయోజనాలను దెబ్బతీసి లాభపడాలని భావించే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.... ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. తబ్లిగీ జమాత్ ఘటనను పరోక్షంగా ప్రస్తావించిన మోహన్ భగవత్....ఒక్కరు తప్పు చేస్తే ప్రతి ఒక్కరు దోషులు అని భావించరాదని సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. కరోనా వల్ల కష్టాలు పడుతున్న వారికి ఎలాంటి వివక్ష లేకుండా సాయం చేయాలని సూచించారు. అవసరంలో ఉన్న వారందరిని తమ సొంతవారిగా భావించాలని ఉద్ఘాటించారు భగవత్. కరోనా ప్రమాదం అంతమయ్యే వరకు ఆర్‌ఎస్సెస్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వాలు, ప్రజానీకం వైరస్‌పై చురుకుగా వ్యవహరిస్తూ మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కొంటున్నాయని ఆయన ప్రశంసించారు. భారత్‌ను స్వయం సమృద్ధి సాధించే ఆర్థిక వ్యవస్ధగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు మోహన్ భగవత్. మహారాష్ట్రలోని పాల్‌ఘఢ్‌లో ఇద్దరు సాధువుల హత్యను ఖండించారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశవ్యతిరేక శక్తుల పట్ల కోపం, భయం కలిగి ఉండరాదని ఆయన వెల్లడించారు.