అయోధ్య వివాదాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని భావించామని... ఇప్పుడు అందుకు అనుగుణంగానే సుప్రీం తీర్పు వెలువడిందని అన్నారు ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్.
ఆరెస్సెస్ అంటే ఆందోళన కోసం ఉద్దేశించింది కాదని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ తీర్పును ఒకరి గెలుపు మరొకరి ఓటమిగా భావించరాదని అన్నారు మోహన్ భగవత్.
"శ్రీరామ జన్మభూమికి సంబంధించిన అంశమై సుప్రీంకోర్టు ద్వారా ఈ దేశ ప్రజల విశ్వాసాలను కాపాడే విధంగా ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగిన సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత తుదితీర్పు వెలువడింది.
ఈ తీర్పును ఒకరి విజయం మరొకరి పరాజయంగా భావించరాదు. సత్యం న్యాయాన్ని మధిస్తే వచ్చిన ఫలితం ఇది. భారత సమాజంలో అంతర్లీనంగా ఉన్న ఐకమత్యాన్ని మరింత బలోపేతం చేసే నిర్ణయంగా దీన్ని భావించాలి, ఆ దిశగానే దీన్ని అమల్లోకి తీసుకురావాలి. దేశ చట్టాలు, రాజ్యాంగానికి లోబడి దేశ ప్రజలు తమ భావాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాను. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సర్వోన్నత న్యాయస్థానం చేసిన సూచనను ప్రభుత్వం శీఘ్రంగా అమలు చేస్తుందని మేం భావిస్తున్నాం. గతంలో జరిగిన అన్ని విషయాలను మరిచిపోయి.. రామజన్మ భూమిలో మందిర నిర్మాణంలో అందరూ పాల్పంచుకోవాలని కోరుతున్నాం."
-మోహన్ భగవత్, ఆరెస్సెస్ అధినేత
ఇదీ చూడండి: 'దేశభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది'