రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సెప్టెంబరు 20న విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ మంగళవారం ఉదయం ఒక్క రోజు దీక్ష చేపట్టారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. బుధవారం దీక్షను విరమించారు.
వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో అనుచితంగా ప్రవర్తించిన 8 మంది విపక్ష సభ్యులపై సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు ఛైర్మన్. ఈ చర్యను నిరసిస్తూ వారంతా ఆ రోజు రాత్రి పార్లమెంటు ఆవరణలోనే గడిపారు. మరునాడు ఉదయం వారికి టీ తీసుకెళ్లారు హరివంశ్. అయితే 8మంది సభ్యులు టీని నిరాకరించారు. ఆ తర్వాత తాను దీక్ష చేస్తూనే బాధ్యతలు నిర్వర్తిస్తానని ఛైర్మన్‌కు లేఖ రాశారు హరివంశ్.
8మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని మంగళవారం రోజు సభలో డిమాండ్ చేశాయి విపక్షాలు. ఇందుకు ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిరాకరించారు. అనంతరం విపక్ష సభ్యులందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'సభ్యుల తీరుకు నిరసనగా డిప్యూటీ ఛైర్మన్ ఉపవాసం'