కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను తమ కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దిల్లీ హైకోర్టును కోరింది. మనీలాండరింగ్ కేసులో వాద్రాకు నేరుగా సంబంధముందనే ఆరోపణలున్నాయని పేర్కొంది దర్యాప్తు సంస్థ. కేసు విచారణలో ఆయన తమకు సహకరించడం లేదని వివరించింది.
వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన వ్యాజ్యంపై దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఈడీ వ్యాఖ్యలను ఖండించారు వాద్రా తరఫు న్యాయవాది. సమన్లు జారీచేసినప్పుడల్లా ఆయన ఈడీ ఎదుట హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకపోవటం సహకరించనట్లు కాదని స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: ముంబయి రోడ్లపై చేపల వేట.. ఎందుకో తెలుసా?