మనం ఇంటికి వెళ్లగానే అమ్మ ఒక్క క్షణం కనిపించకపోతేనే కంగారు పడతాం. నిద్రలోంచి లేవగానే అమ్మా.. అమ్మా అంటూ దగ్గరికి వెళతాం. ఆ మాతృమూర్తి ఒక్కసారి కనిపించకపోతేనే పిల్లలు పడే బాధ అంతా ఇంతా కాదు. అలాంటిది కనిపించకుండా పోయిన తల్లిని 14ఏళ్ల తర్వాత చూసిన ఇద్దరు తమిళనాడు వాసుల సంతోషం వర్ణనాతీతం.
14 ఏళ్ల క్రితం
తమిళనాడు కోర్తంపేట్కు చెందిన మేరీ అనే మహిళ 14 ఏళ్ల క్రితం మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇల్లు విడిచి వెళ్లిపోయింది. అప్పటికే ఆమెకు 9 నెలల పసిపాప సహా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె భర్త తన కోసం ఏడాదిపాటు వెతికి ఆశలతో పాటు ప్రాణాలను వదిలేశాడు.
తినీ తినక, ఫుట్‌పాత్‌లపై
తినీ తినక, ఫుట్‌పాత్‌లపై నిద్రించి అవస్థలు పడుతూ నాలుగేళ్లపాటు గడిపింది మేరీ. తర్వాత మంగుళూరు మరోలిలోని వైట్ హౌస్ పునరావాస కేంద్రం వారి కంటపడింది. వారు ఆమెను చేరదేసి బాగోగులు చూసుకుని చికిత్స చేయించారు.
ఓ డాక్టర్ చొరవతో
తమిళనాడు కోర్తంపేట్కు చెందిన ఓ వైద్యుడు మంగుళూరులోని ఈ పునరావాస కేంద్రాన్ని సందర్శించగా మేరీ వివరాలు తెలిశాయి. ఆ వివరాలను కోర్తంపేట్ స్థానిక చర్చిలోని తన మిత్రుడైన ఫాదర్‌కు అందించాడు. ప్రార్థనా సమయంలో చర్చి ఫాదర్ మేరీ వివరాలను బహిర్గతం చేయగా ఆ సమాచారం ఆమె పిల్లలకు చేరింది. వెంటనే వారు హుటాహుటిన మంగుళూరులోని పునరావాస కేంద్రానికి చేరుకుని తమ తల్లిని కలుసుకున్నారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ బాటిళ్లతో సుందరమైన శ్వేత ఏనుగు!