దిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమా భారతి ఆసక్తికర ట్వీట్ చేశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పరాజయం పొందినప్పటికీ.. దేశంలో మోదీకి సరితూగే నాయకుడే లేరని ట్వీట్ చేశారు. ప్రధాని ఓ అసమానుడని చెప్పుకొచ్చారు. మోదీని మరాఠా సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీతో పోల్చుచూ.. 'ఛత్రపతి మోదీ జిందాబాద్' అని ట్వీట్ చేశారు.
"2019 లోక్సభ ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల ముందు దేశంలోని చాలా రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. భాజపాతో పాటు దేశంలోనే మోదీకి సరితూగే నాయకుడు లేడని ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. దేశ ప్రజలు, ప్రధాని మోదీ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. ఛత్రపతి మోదీ జిందాబాద్."
- ఉమా భారతి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
ఆప్-62, భాజపా-8
దేశ రాజధాని దిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయదుందుబి మోగించింది. మొత్తం 70 స్థానాలకుగానూ 62 సీట్లను సొంతం చేసుకుంది. మిగతా ఎనిమిది స్థానాలను భాజపా కైవసం చేసుకోగా.. కాంగ్రెస్కు వరుసగా రెండోసారి రిక్తహస్తమే మిగిలింది.