మధ్యప్రదేశ్‌లో రిసార్ట్ రాజకీయం మొదలైంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా.. తమ ఎమ్మెల్యేలను అజ్ఞాత ప్రాంతాల్లో ఉంచాయి. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా చూసేందుకే ఇరు పార్టీలు రిసార్ట్ రాజకీయాన్ని తెరపైకి తెచ్చాయి.
తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్.. మిగిలిన 92 మందిని దాచి పెట్టింది. ప్రభుత్వానికి మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలను రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు కాంగ్రెస్ తరలించనుంది.
కాంగ్రెస్ భేటీ...
రాజకీయ సంక్షోభం తలెత్తిన వేళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు వెల్లడించారు.
ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తమ మెజారిటీని నిరూపించుకుంటామని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనను పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అటు రాజీనామా చేసి బెంగళూరులో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లనున్నారు.
భాజపా రాజకీయం...
మరోవైపు భాజపా తమ 107 మంది ఎమ్మెల్యేలను ఒకేచోట ఉంచాలని నిర్ణయించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలందర్ని తీసుకుని దిల్లీ వెళ్తున్నట్లు ఆ పార్టీ నేత గోపాల్ భార్గవ తెలిపారు.