ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు విధానాల్లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.
"ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా వంటి దేశాలు గతంలో ఈవీఎంలను వినియోగించాయని మరచిపోకూడదు. కానీ ఆ దేశాలు ప్రస్తుతం ఈవీఎంలను వాడటం లేదు. మనమెందుకు బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురాకూడదు? ఎన్నికల విధానాల్లో సంస్కరణలు అవసరమని 1995 నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. రాజకీయ పార్టీలు పారదర్శకంగా ఉండేందుకు తప్పనిసరిగా ఎన్నికల సంస్కరణలు అవసరం."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నల్లధనాన్ని వినియోగిస్తున్నాయని ఆరోపించారు మమత. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా సర్కారు నిధుల వినియోగం అవసరమన్నారు.
ఇదీ చూడండి: దిల్లీలో 'కార్గిల్ విక్టరీ రన్'- పౌరుల ఉత్సాహం