ప్రముఖ మలయాళ రచయిత అక్కితం అచ్యుతన్ నంబూదిరిని జ్ఞాన్‌పీఠ్ అవార్డు వరించింది. సాహిత్య ప్రపంచంలో విశేష కృషి చేసినందుకు గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. దేవయానంలో గురువారం జరిగిన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. సాంస్కృతిక శాఖ మంత్రి ఏకే బాలన్ ముఖ్యమంత్రి తరఫున అచ్యుతన్‌కు పురస్కారాన్ని అందజేశారు. కొవిడ్ నిబంధనల మధ్యే ఈ కార్యక్రమం జరిగింది.
దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం అయిన జ్ఞాన్‌పీఠ్ వరించిన వారికి రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య శిల్పాన్ని కానుకగా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.
అచ్యుతన్ సాహిత్య సేవలకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. కేంద్ర, రాష్ట్ర సాహిత్య పురస్కారాలు, ఒదక్కుళల్, ఎళుతాచ్చన్ వంటి పురస్కారాలు దక్కాయి.
జ్ఞాన్‌పీఠ్ అవార్డు అందుకున్న మలయాళ రచయితల్లో జీ శంకర కురుప్ మొదటి వారు. తకాజి శివశంకర పిల్లై, ఎంటీ వాసుదేవన్ నాయర్, ఎస్కే పొట్టాకద్, ఓఎన్వీ కురూప్కు కూడా ఈ పురస్కారం దక్కింది.