కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు అనుమతించిన కొద్ది వారాల్లోనే బ్లాక్ మార్కెట్లో ఈ ఔషధం ధర నింగికెగిసింది. ఈ డిమాండ్‌ను ఉపయోగించుకొని ఔషధం నుంచి డబ్బులు దండుకునేందుకు డ్రగ్ వ్యాపారులు, కెమిస్ట్‌లు అక్రమమార్గం అనుసరిస్తున్నారు. వైరస్‌కు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఈ ఔషధాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల వీరి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.
దిల్లీలోని ఓ వ్యాపారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన తోబుట్టువుకు కరోనా సోకడం వల్ల ప్రైవేటు ఆస్పత్రి(కొవిడ్ కేర్ సెంటర్)లో చేర్పించారు.
"రోగికి రెమ్‌డెసివిర్ అవసరం ఉందని ఆస్పత్రిలోని వైద్యుడు నాకు ఫోన్ చేసి చెప్పారు. అయితే రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఔషధాన్ని ముందుగానే ఎక్కించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో తగిన నిల్వలు లేవని, కాబట్టి రెండు వయల్స్ తీసుకొచ్చి ఇవ్వాలని నాకు సూచించారు. దిల్లీలోని అధికారిక దుకాణాల్లో దొరకని ఈ రెమ్‌డెసివిర్.. బ్లాక్ మార్కెట్లో దొరికింది."
-రోగి బంధువు, దిల్లీలోని వ్యాపారవేత్త
ఆథరైజ్డ్ డీలర్ల వద్ద రెమ్‌డెసివిర్ కొనుగోలు చేయాలంటే రోగి ఆధార్ నెంబర్, కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. సాధారణంగా దీని ధర రూ. 4,500 ఉంటుంది. చావు బతుకుల సమస్య కావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ల నుంచే ఔషధాన్ని కొనుగోలు చేస్తున్నారు.
అత్యవసర సమయాల్లో డబ్బులు దండుకోవడానికి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారని ఈటీవీ భారత్‌తో ఆవేదన వ్యక్తం చేశారు రోగి బంధువు.
"మా బంధువు వెంటిలేటర్‌పై ఉన్నాడు. రెండు ప్రదేశాల్లో ఔషధం లభించలేదు. ఇతర మార్గాల గురించి అన్వేషిస్తున్నప్పుడు.. కొందరు మా వద్దకు వచ్చి బ్లాక్మార్కెట్లో దొరుకుతుందని చెప్పారు. ఒక్క వయల్ రూ. 15 వేలని చెప్పారు. తర్వాతి రోజు దాన్ని తీసుకోవడానికి నిర్ణయించుకొని వారిని సంప్రదిస్తే.. తొలుత రూ. 27 వేలు ఆ తర్వాత.. రూ. 35 వేలు డిమాండ్ చేశారు. దీని ధర బంగారంలా పెరిగిపోయింది."
-రోగి బంధువు, దిల్లీలోని వ్యాపారవేత్త
రెండు గంటల ముందు సమాచారం అందిస్తే రెమ్‌డెసివిర్‌ను అందిస్తామని దిల్లీలోని కొందరు కెమిస్ట్‌లు అన్నట్లు బాధితుడి బంధువు చెప్పుకొచ్చారు. ఔషధ ప్రామాణికత గురించి అనుమానం రాకుండా ఎంఆర్పీ రేట్లతో బిల్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు.
"బిల్లు ఇవ్వకుంటే ఔషధం అసలైందో కాదో నాకెలా తెలుస్తుందని నేను కెమిస్ట్‌ను అడిగాను. బ్యాచ్ నెంబర్ వంటి వివరాలను తనిఖీ చేసుకొని ప్రామాణికతను నిర్ధరించుకోవడానికి ఎంఆర్పీ రేట్లతోనైనా బిల్లు ఇవ్వాలని కోరాను."
-రోగి బంధువు, దిల్లీలోని వ్యాపారవేత్త
దిల్లీలో ఉన్న ఈ బ్లాక్ మార్కెట్ వ్యాపారం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆ రోగి బంధువు అభిప్రాయపడ్డారు. తనలా అధిక ధరలకు మందులు కొనే సామర్థ్యం అందరికీ ఉండదని.. సామాన్యులు దీన్ని భరించలేరు కాబట్టి ఈ సమస్యను లేవనెత్తుతున్నట్లు చెప్పారు. చివరకు హెటిరోకు చెందిన అధీకృత డీఎస్ఏ కంపెనీ నుంచి ఔషధాన్ని పొందినట్లు తెలిపారు. ఈ సమస్యను లోకల్ సర్కిల్ యాప్ ద్వారా బయటపెట్టారు ఈ వ్యాపారవేత్త. అయితే ఆస్పత్రి పేరు, వివరాలు వెల్లడించలేదు.
యాప్‌లోని పోస్ట్ ఆధారంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ గోస్వామి చర్యలు చేపట్టారు. రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెట్‌పై దర్యాప్తు చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్పీతో పోలిస్తే అధిక ధరలకు ఔషధాలను విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
(రచయిత-కృష్ణానంద్ త్రిపాఠీ)
ఇవీ చదవండి