యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్, రోగనిరోధకశక్తిని పెంచే టోసీలిజుమాబ్ ఔషధాలను అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు పరిమితంగా ఉపయోగించేలా మార్గ దర్శకాలు జారీచేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు క్లినికల్ మేనేజ్‌మెంట్ గైడ్‌లైన్స్‌లో సవరణలు చేసినట్లు సమాచారం. ఐసీయూలో ఉన్న....కరోనా రోగుల కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అజిత్రోమైసిన్‌ను సిఫార్సుచేస్తూ మార్చి 31న మార్గదర్శకాలు జారీచేశారు. తాజాగా వీటిలో నుంచి అజిత్రోమైసిన్‌ను తొలగించి, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను యథాతథంగా కొనసాగిస్తూ.. మార్గదర్శకాలను సవరించనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19కు మందు, వ్యాక్సిన్ లేని కారణంగా.. పరిస్థితులకు అనుగుణంగా చికిత్సా మార్గదర్శకాలను సవరించాలని భావిస్తున్నట్లు సమాచారం.
టోసీలిజుమాబ్ ఔషధం ఇమ్యునోమోడ్యులేటర్‌గా పనిచేస్తుండగా దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఐతే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అనుబంధంగా మరికొన్ని ఔషధాలను ఉపయోగించాలని భావిస్తున్న ఆరోగ్యశాఖ వాటిపై ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. కొత్త క్లినికల్ మేనేజ్‌మెంట్ గైడ్‌లైన్స్ ఖరారు చేసేందుకు కోవిడ్19పై ఏర్పాటైన జాతీయ కార్యచరణ దళం ఆదివారం సమావేశమైంది.
అత్యవసర పరిస్థితుల్లో రెమిడెసివిర్‌ను పరిమితంగా ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ గతవారం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెమెడెసివిర్ వినియోగానికిఅనుమతించే ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది