ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురవడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ భాజపా ఎమ్మెల్యే, ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు కుల్దీప్ సెన్గర్తో పాటు మరో 8మందిపై హత్య కేసు నమోదు చేశారు ఆ రాష్ట్ర పోలీసులు.
రోడ్డు ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని బాధితురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం కేసు నమోదు చేశారు పోలీసులు.
రాయ్‌బరేలీ వెళ్తూ...
రాయ్‌బరేలీ జైలులోని తమ బంధువును చూసేందుకు... ఆదివారం బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది బయలుదేరారు. దారి మధ్యలో వారి వాహనాన్ని ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాధితురాలు, న్యాయవాది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
'ప్రమాదం కాదు... కుట్రే'
రోడ్డు ప్రమాదంపై బాధితురాలి బంధువులు స్పందించారు. జరిగింది రోడ్డు ప్రమాదం కాదని... ఎమ్మెల్యేనే దాడి చేయించాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితురాలి మేనమామ డిమాండ్ చేశారు.
సిబీఐకి సిఫార్సు...
ఈ పూర్తి వ్యవహారాన్ని సీబీఐకి సిఫార్సు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రాథమిక అంచనా ప్రకారం రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
రాజకీయ దుమారం...
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావటంపై రాజకీయ దుమారం రేగింది. ప్రమాద ఘటనపై పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేశారు.
ఘటనకు సంబంధించిన వార్త విని ఆశ్చర్యానికి గురైనట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
"రోడ్డు ప్రమాదం వార్త విని ఎంతో ఆశ్చర్యపోయా. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? నిందితుడు ఇంకా భాజపాలోనే ఎందుకు ఉన్నాడు?"
-- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
రోడ్డు ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
"ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ న్యాయం బదులు బాధితురాలి హత్యకు కుట్ర జరిగింది. పోలీసు కస్టడీలో బాధితురాలి తండ్రి మరణించారు. ఇప్పుడు ఆమె తన కుటుంబ సభ్యులను పోగొట్టుకుని చావు బతుకుల మధ్య పోరాడుతోంది."
రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనను సుమోటోగా పరిగణించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
దిల్లీలో నిరసనలు...
ప్రమాదంపై దిల్లీలోని ఇండియా గేట్ వద్ద అనేక మంది నిరసనలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలికి న్యాయ జరగాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:- దివాలా చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం