ఏప్రిల్ 4న ప్రకటించనున్న రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వృద్ధి నెమ్మదించటం.. ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడుతుందన్న భయాల మధ్య... ఆర్థిక కార్యకలాపాలను పెంచటానికి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
18 నెలల అనంతరం గత ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది రిజర్వు బ్యాంకు. మళ్లీ ఇప్పుడు తగ్గించినట్లయితే రుణదాతలకు ఊరట కలగనుంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) మూడు రోజుల పాటు భేటీ అయిన అనంతరం ఏప్రిల్ 4న నిర్ణయాన్ని వెలువరించనుంది. ఇది 2019-20లో మొదటి సమీక్ష.
పారిశ్రామిక వేత్తలతో గవర్నర్ భేటీ...
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చిన్న తరహా పారిశ్రామిక వేత్తలు, బ్యాంకుల ప్రతినిధులు, పారిశ్రామిక సంస్థలు, డిపాజిటర్ సంఘాలతో భేటీ అయ్యారు. ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతంలోపే ఉండటంతో మరో సారి రేట్లు తగ్గించాలని వారు కోరుతున్నారు.
25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల కోతకు మార్కెట్ అనుకూలంగా ఉంది. లిక్విడిటీ పెరుగుతుందన్న అంచనాల మధ్య కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. 'తటస్థం'గా ఉన్న మార్కెట్లు 'సర్దుబాటు' వైఖరి అవలంబించనున్నాయి. వడ్డీ రేట్ల కోత వల్ల మార్కెట్ మళ్లీ పుంజుకుంటుంది.
- పీకే శర్మ, క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ సారథి, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
భవిష్యత్ విధాన నిర్ణయాలు మాత్రం అంతర్జాతీయ, దేశీయ కారణాలపైనే ఆధారపడి ఉంటాయని అన్నారు. వినియోగం తగ్గిపోవటంతో పాటు పెట్టుబడి చక్రం కూడా కింది స్థాయిలోనే ఉందని కొటక్ మహీంద్రా బ్యాంకు వినియోగదారుల బ్యాంకింగ్ అధ్యక్షులు.. శక్తి ఏకాంబరం అన్నారు.
ఈ విధాన ప్రకటన తరవాతా 25 పాయింట్ల వడ్డీ రేట్ల కోత ఉండొచ్చు. కానీ ఇది ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలపై ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టే బడ్జెట్, రుతుపవనాలు, ముడిచమురు ధరలను కూడా ఆర్బీఐ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది.
- ఏకాంబరం, కొటక్ మహీంద్రా బ్యాంకు (వినియోదారుల బ్యాంకింగ్) అధ్యక్షులు
రేట్ల తగ్గింపు.. బ్యాంకులకు కూడా బదిలీ కావాలంటే ద్రవ్య నిల్వల నిష్పత్తి (క్యాష్ రిజర్వు రేషియో-సీఆర్ఆర్)ని కూడా తగ్గించాలని భారత పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనవర్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. దీనివల్ల రుణాలివ్వటానికి బ్యాంకులకు ఎక్కువ నిధులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
నెమ్మదించిన వృద్ధి..
తయారీ రంగంలో మూలధన, ఉత్పాదక రంగాలు నిరాశపరచటం వల్ల పారిశ్రామికోత్పత్తి జనవరిలో 1.7 శాతానికి పడిపోయింది. ఇది ఏడాది క్రితం 7.5 శాతంగా ఉంది. ఫిబ్రవరికి సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ విడుదల కావాల్సి ఉంది.
వినియోగదారుల ధరల సూచీలో ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి దిగువనే ఉంది. ఫిబ్రవరిలో ఇది 2.57 శాతంగా నమోదైంది.
ప్రపంచ వృద్ధి నెమ్మదిస్తుండటం వల్ల చైనా ఇటీవలే తమ దేశ వృద్ధి అంచనాలను తగ్గించింది. భారత అతిపెద్ద వ్యాపార భాగస్వాముల్లో చైనా ఒకటి. అమెరికా ప్రభుత్వ నివేదిక ప్రకారం 2018 నాలుగో త్రైమాసికంలో 2.2 వృద్ధి సాధించింది ఆ దేశం. ఇది క్రితం అంచనా వేసిన 2.6 కంటే తక్కువ కావటం గమనార్హం.
ఇదీ చూడండి:జీఎస్టీ విధానం సులభతరం ఆలస్యం