ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారంటూ వచ్చిన వార్త కలకలం రేపింది. ఈ మేరకు ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ లేఖ బహిర్గతమైనందున నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. సమాచారం అందుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు రాంచీ చేరుకున్నారు. లేఖ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రాంచీ మహిళ లేఖ
రాంచీకి చెందిన 'నయా సరయ్' అనే మహిళ రాయ్‌పుర్ జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి లేఖ పంపినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల క్రితం నుంచి తన అత్తామామలు మోదీ హత్యకు ప్రణాళికలు రచిస్తున్నారని లేఖలో మహిళ పేర్కొంది. ఇప్పటికీ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపింది.
ఎలాంటి ఆధారాలు లేవు: ఎన్ఐఏ
ఈ విషయంపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ అధికారులు మోదీ హత్యకు కుట్రపన్నుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. తర్వాతి ఆదేశాలు అందేవరకు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని వెల్లడించారు.
దర్యాప్తులో అసలు నిజం
అయితే, దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. కుటుంబ కలహాలే ఈ తతంగమంతటికీ కారణంగా తెలుస్తోంది. తన అత్తామామలు వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని సదరు మహిళ ఇదివరకే పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసుతో పాటు తన అత్తమామలు ప్రధాని హత్యకు ప్రణాళికలు రచిస్తున్నారంటూ నయా సరయ్ లేఖలో ఆరోపించిందని అధికారులు స్పష్టం చేశారు.