ఒక తరగతి - ఒక ఛానెల్ అన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు కార్యరూపం కల్పించే దిశగా పనిచేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. డిజిటల్ సాధనాలు లేని విద్యార్థులకు, అంతర్జాలం అందుబాటులో లేనివారికి విద్యా బోధనను దగ్గర చేసేందుకు సృజనాత్మకతతో కూడిన ఆలోచనలు చేస్తున్నట్లు 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో వెల్లడించారు. అనతి కాలంలోనే ఆన్‌లైన్ విద్యాబోధనలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఉన్నత విద్యకోసం.. విదేశాలవైపు చూసే మానసిక రుగ్మత నుంచి యువభారతం బయటపడాలని ఆకాంక్షించారు నిశాంక్.
కొవిడ్-19తో ఆన్‌లైన్ బోధన..
కొవిడ్-19తో 2020లో విద్యా వ్యవస్థపై తీవ్రప్రభావం పడిందన్నారు నిశాంక్. అయితే పరిస్థితులు మారిపోయి ఆన్‌లైన్ విద్యాబోధన తెరపైకి వచ్చిందన్న ఆయన.. దీనిపై సమర్థంగా పనిచేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా అనేక కమిటీల చర్చల అనంతరం.. సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీలు విద్యా క్యాలెండర్ను రూపొందించాయన్నారు. ఇవి విద్యార్థులకు తప్పక లబ్ధి చేకూరుస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు నిశాంక్.
నేటితరంలో విద్యార్థినీ విద్యార్థులు తమ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదని.. వారు దేశానికి భవిష్యత్తు అని కొనియాడారు పోఖ్రియాల్. కాబట్టి వారి రక్షణకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు చేరువ కావడమే తమ లక్షమన్న ఆయన.. అందుకు తగ్గట్లుగా సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర విద్యాశాఖలు, విద్యామంత్రుల కృషిని ప్రశంసించారు.
ఆ దిశగా ప్రయత్నాలు..
ప్రస్తుత సమాజంలో డిజిటల్ అంతరం నెలకొన్న తరుణంలో.. ఇందుకోసం ఈ-పాఠశాల, దీక్షా పోర్టల్లో సుమారు 80 వేల పాఠ్యాంశాలను పొందిపరచినట్లు స్పష్టం చేశారు నిశాంక్. ఫలితంగా విద్యార్థులకు మరింత చేరువ అవుతామన్న ఆయన.. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలను వారికి అందజేస్తామని చెప్పారు. అయితే స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులకు కూడా వీటిని చేరువ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రధాని చెప్పిన 'ఒక తరగతి- ఒక ఛానెల్', 'ఒక దేశం- ఒక డిజిటల్ వేదిక' అనే దృక్పథాన్ని సాకారం చేసే దిశగా ముందడుగు వేస్తున్నట్లు వివరించారు.
అందులో భాగంగానే సైన్స్ పాఠ్శాంశాలకు సంబంధించిన ప్రయోగ అంశాలనూ ప్రస్తావించారు. దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయన్న నిశాంక్.. విద్యార్థుల సమయాన్ని ఏమాత్రం వృథా కానివ్వమని హామీ ఇచ్చారు. భారత సంప్రదాయ విధానం నుంచి వేగంగా ఆన్‌లైన్ బోధనకు మళ్లినట్లు చెప్పారు. ఈ విషయంలో భారత్ విశ్వగురువుగా మారుతోందని కొనియాడారు నిశాంక్.
ఇక్కడే ఉత్తమ విద్యావ్యవస్థలు..
భారతీయ విద్యా వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు పోఖ్రియాల్. దేశంలో గుణాత్మక విద్యాబోధన లేదనే అపోహతోనే కొందరు విదేశాలకు తరళివెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకోసం విద్యాబోధనను మరింత మెరుగు పరుస్తున్నట్లు చెప్పిన నిశాంక్.. ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలతో దేశీయ విద్యావ్యవస్థను అనుసంధానం చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యకోసం బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా.. మన దేశంలోనే ఉత్తమ విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. ఐఐటీ, ఐఐఎమ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో సుమారు 50 వేల మంది విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు దేశ విదేశాల నుంచి భారీగా విద్యార్థులు తరలివస్తుంటారని చెప్పారు నిశాంక్.
ఇదీ చదవండి: భారీ వర్షాలకు దిల్లీ గజగజ.. స్తంభించిన జనజీవనం