రాజ్యసభ భద్రతా అధికారి ఒకరికి హోదా తగ్గించారు చైర్మన్ వెంకయ్య నాయుడు. సామాజిక మాధ్యమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకర, అవమానకర, వ్యంగ్య పోస్టులు చేసినందుకు శిక్షగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
రాజకీయ తటస్థ వైఖరి కనబర్చకుండా అధికారి ఉరుజుల్ హసన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరించారని రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. మోదీ సహా, పలువురు కేంద్ర మంత్రులు, భాజపా సీఎంలపై అభ్యంతరకర పోస్టులు చేసినందుకే క్రమశిక్షణారాహిత్యం కింద ఈ చర్యను తీసుకున్నట్లు పేర్కొంది. రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలనూ హసన్ షేర్ చేసినట్లు వెల్లడించింది.
ఈ చర్యతో ప్రస్తుతం రాజ్యసభ భద్రతా డిప్యూటీ డైరెక్టర్ ఉన్న హసన్ వేతనంలో మరో ఐదేళ్ల పాటు ఎలాంటి పెంపు ఉండబోదు. పదవీ హోదా తగ్గుతుంది. శిక్షాకాలం పూర్తయ్యే వరకు పదోన్నతి లభించదని రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటన స్పష్టం చేసింది.