రాజ్యసభలో మంగళవారం మూడున్నర గంటల్లోనే 7 కీలక బిల్లులకు ఆమోదం లభించింది. నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు సహా.. మొత్తం 7 బిల్లులను ఆమోదించింది పెద్దల సభ.
నిత్యావసర వస్తువుల సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు చట్టంగా మారితే.. ఉల్లి, నూనెలు, పప్పులు, తృణధాన్యాలను నిత్యావసర వస్తువుల జాబితాను తొలగించవచ్చు. ఈ బిల్లును లోక్‌సభ ఈ నెల 15న ఆమోదించింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. దీని ద్వారా సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకురావచ్చు.
చాలా బిల్లులను పెద్దగా సభ్యుల భాగస్వామ్యం లేకుండానే ఆమోదించింది ఎగువసభ. మంత్రుల వివరణ కూడా త్వరగానే ముగిసింది.
ఎంపీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ.. అంతకుముందు కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్, సమాజ్వాదీ, ఎన్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఎగువసభ ఆమోదం పొందిన బిల్లులు..
- కొత్తగా స్థాపించిన ఐదు ఐఐఐటీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ప్రకటించే బిల్లు
- నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు
- బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు
- జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ బిల్లు
- రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ బిల్లు
- టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు-2020
కరోనా వైరస్ నేపథ్యంలో.. పన్ను, జీఎస్టీ చెల్లింపులు, పన్ను దాఖలు కాలపరిమితిని సడలించే ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించారు.
- కంపెనీల చట్ట సవరణ బిల్లు-2020
ఈ బిల్లుతో వేర్వేరు అపరాధాలను నేరాల జాబితా నుంచి తప్పించవచ్చు.
ఈ ఏడు బిల్లులూ.. ఇది వరకే లోక్సభలో గట్టెక్కాయి. ఇప్పుడు వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ఆయన అంగీకారం తెలిపితే.. చట్టంగా మారుతాయి.
బిల్లుల ఆమోదం కోసం మంగళవారం సభా సమయాన్ని మరో గంటకుపైగా పొడిగించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు వ్యవసాయ సంబంధిత బిల్లులు రాజ్యసభలో ఆదివారం విపక్షాల ఆందోళనల మధ్య ఆమోదం పొందాయి. బిల్లుల ఆమోదం విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పలువురు ప్రతిపక్ష నాయకులు డిప్యూటీ ఛైర్మన్ పోడియం వద్ద అనుచితంగా ప్రవర్తించారు. దీంతో 8 మంది ఎంపీలపై ఛైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మంగళవారం సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాతే బిల్లులను ఆమోదించుకుంది కేంద్రం.
ఇదీ చూడండి: 'ఆ ఎంపీలు క్షమాపణ చెబితేనే వేటుపై పునరాలోచన'