ఫ్రాన్స్ నుంచి మొదటి రఫేల్ యుద్ధ విమానం భారత్ అమ్ములపొదిలో చేరనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం దసరా వేడుకల్లో భాగంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆయుధపూజ చేయనున్నారు. తర్వాత యుద్ధవిమానంలో ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టనున్నారు.
గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజ్‌నాథ్‌సింగ్ ఇలానే ఆయుధపూజ చేశారు.
ఫ్రాన్స్‌లో పర్యటన
రాజ్‌నాథ్ సింగ్ రక్షణమంత్రి హోదాలో సోమవారం నుంచి మూడు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. రక్షణ, భద్రత మొదలగు ద్వైపాక్షిక అంశాలను చర్చిస్తారు.
అనంతరం ఫ్రాన్స్‌లోని బోర్డియాక్స్కు రాజ్‌నాథ్ సింగ్ చేరుకుంటారు. డసో ఏవియేషన్ రఫేల్ యుద్ధవిమానాన్ని భారత్‌కు అందిస్తుంది. ఆ రోజు దసరా పండుగ కనుక.. రాజ్‌నాథ్ అక్కడే రఫేల్ జెట్‌కు ఆయుధపూజ చేస్తారు. తరువాత ఆ యుద్ధవిమానంలో కొంతసేపు విహరిస్తారు.
భారత అమ్ములపొదిలో..
భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసింది. ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ మొదటి రఫేల్ జెట్‌ను మంగళవారం భారత్‌కు అందించనుంది. అయితే మొదటి బ్యాచ్‌లో భాగంగా నాలుగు విమానాలు మాత్రం వచ్చే ఏడాది మే నాటికి భారత్‌కు వస్తాయి.
మేక్ ఇండియా కోసం..
అక్టోబర్ 9న ప్రముఖ ఫ్రెంచ్ రక్షణ సంస్థల సీఈఓలతో రాజ్‌నాథ్‌సింగ్ సమావేశమవుతారు. భారత రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా'లో భాగస్వాములు కావాల్సిందిగా కోరనున్నారు.
ఇదీ చూడండి: పన్ను మదింపు సేవలు ఇక మరింత సులభం!