దేశం ఎంతగానో ఎదురుచూస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలి రఫేల్ విమానాన్ని నేడు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఫ్రాన్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించనున్నారు రక్షణమంత్రి. అనంతరం యుద్ధవిమానంలో ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టనున్నారు. ఈ కార్యక్రమం కోసం డసో ఏవియేషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
మూడు రోజుల పాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు రాజ్‌నాథ్. రఫేల్ విమానాన్ని స్వీకరించే ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్ మెక్రాన్‌తో భేటీకానున్నారు. రక్షణ, భద్రత వంటి ద్వైపాక్షిక అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నారు.
రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌కు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్ వినియోగిస్తోన్న వాటి కన్నా ఆధునికమైనందున.. భారత వాయుసేన పైలట్లకు దీనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 24 మందిని మూడు బ్యాచ్‌లుగా ఫ్రాన్స్‌కు పంపి వచ్చే ఏడాది మే నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.
ఇదీ చూడండి:- 'ఆమె మృతికి కారణం 'గాలి'... కేసు పెట్టండి'