మార్పు మంత్రంతో రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. రాజకీయ ప్రవేశంపై అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ భవిష్యత్ ప్రణాళికపై సవివర ప్రకటన చేశారు. తనకు సీఎం పదవిపై ఆశ లేదని తేల్చి చెప్పారు.
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో విలేకరులు, రజనీ మక్కల్ మండ్రమ్ నిర్వాహకులను ఉద్దేశించి రజనీకాంత్ ప్రసంగించారు.
"ఇది రజనీకాంత్ కోసం కాదు.. తమిళ యువత, ప్రజల కోసం. మార్పు వచ్చి తీరాలి. ఎందుకంటే నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇది. నాకేమన్నా 44, 50 ఏళ్లా..? 71 ఏళ్లు. ఇప్పుడు ఓడిపోతే వచ్చే ఎన్నికలకు 77 ఏళ్లు వస్తాయి. ఇప్పుడు చెప్పిన సిద్ధాంతాలే అప్పుడు చెబితే ఏం లాభం. ఇప్పుడు తేలేని మార్పు అప్పుడు ఎలా తేగలను. అందుకే చెబుతున్నా.. ఈ విషయంలో పదేపదే సీఎం, సీఎం అనకండి. తమిళనాడులోని ప్రతి ప్రాంతానికి వెళ్లి చెప్పండి. నాకు సీఎం పదవి చేపట్టాలని లేదు.. మార్పు రావాలి, రాజకీయ విప్లవం రావాలి. ఇది వాళ్లకు తెలియాలి. అందరికీ తెలియాలి. అప్పుడు వస్తా.. నేను వస్తా. ఇప్పుడు రాకపోతే.. మార్పు ఎప్పటికీ రాదు."
- రజనీకాంత్, సినీనటుడు
ఇద్దరూ వేరుగా ఉండాలి...
తన ఉద్దేశం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవికి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఉండాలన్నారు సూపర్‌స్టార్. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చేలా పర్యవేక్షించడానికి మాత్రమే పార్టీ అధ్యక్షుడు పరిమితం కావాలని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే విధానం అనుసరిస్తామని స్పష్టంచేశారు రజనీ.
యువతకే పెద్దపీట...
50 ఏళ్లు పైబడిన వారే ప్రస్తుత రాజకీయాల్లో అధికంగా ఉంటున్నారని రజనీ తెలిపారు. తాను స్థాపించబోయే పార్టీలో 65 శాతం యువతకే అవకాశం కల్పిస్తానన్నారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్, విశ్రాంత న్యాయమూర్తులు వంటి వారికి 35 శాతం మేర పార్టీలో స్థానం కల్పిస్తామని తెలిపారు.
వారికి చావోరేవో...
జయలలిత, కరుణానిధి వంటి ఉద్దండులు లేని ప్రస్తుత తరుణంలో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని రజనీ అన్నారు. గత పదేళ్లుగా అధికారం చెలాయిస్తున్న అన్నాడీఎంకే ధనబలంతో ఉందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలవడం డీఎంకేకు చావోరేవో అన్నట్లు ఉందన్నారు. ఇరు ప్రధాన పార్టీలను ఎదుర్కోవాల్సిన తరుణమిదని.. ఇందుకు సిద్ధంగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చారు రజనీకాంత్.
అందుకే అసంతృప్తి...
తాను సీఎంగా ఉండనని చెబితే కొందరు యువత మినహా ఎవరూ అంగీకరించలేదని రజనీ అన్నారు. పదవులు మంచి చేయడానికి తప్ప అధికార దాాహానికి కాదన్నారు. ఇదే విషయాన్ని గతవారం జరిగిన పార్టీ కార్యదర్శుల సమావేశంలో తెలిపానన్నారు. అయితే తన మాటలను ఎవరూ ఒప్పుకోలేదని ఈ విషయమే తనను అసంతృప్తికి గురిచేసిందన్నారు రజనీ.
అప్పుడు ఆసక్తి లేదు...
1996కు ముందు తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్నారు రజనీ. 1996 ఎన్నికలప్పుడు తనను రాజకీయాల్లోకి రావాలని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, కేంద్ర మంత్రి చిదంబరం వంటి వారు కోరారని గుర్తుచేశారు. అప్పటి నుంచే తాను రాజకీయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
- ఇదీ చూడండి:ఆ వాచ్‌లు మాకు ఎప్పుడు ఇస్తారు: ఎంపీల ప్రశ్న