దంగల్... రెజ్లర్లు గీత, బబితా ఫొగట్‌ల బయోపిక్. ఓ పల్లెటూరి పేద తండ్రి తన కూతుళ్లకు మట్టిలో కుస్తీ నేర్పించి.. అంతర్జాతీయ క్రీడాకారిణులుగా తీర్చిదిద్దిన యదార్థ కథకు దృశ్యరూపం. అచ్చంగా అలాంటి తండ్రి కథే.. రాజస్థాన్ భరత్‌పుర్‌లో వెలుగు చూసింది. పేదరికాన్ని ఎదిరించి నలుగురు కుమార్తెలకు తన పొలంలోనే రెజ్లింగ్ నేర్పించాడు. జాతీయస్థాయి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దాడు.
కూతుళ్లే.. అయితే?
రాజస్థాన్ జైపుర్‌కు 180 కి.మీ దూరంలో ఉన్న భరత్‌పుర్ కుస్తీ క్రీడకు పెట్టింది పేరు. అయితే.. ఆడపిల్లలు రెజ్లింగ్ చేస్తే మాత్రం ఒప్పుకునే విశాల హృదయులు చాలా తక్కువ. కానీ, కుమార్తెలైతే ఏంటి... వారినీ కుమారుల్లా పెంచాలనుకున్నాడు ఊంఛాగావ్ వాసి కేసరి.
కేసరి... ఓ రైతు. అయినా... నలుగురు కూతుళ్లను ఎప్పటికైనా మంచి క్రీడాకారిణులుగా తయారు చేయాలని కలలు కన్నాడు. అనుకున్నట్టే తన మొదటి ఇద్దరు కుమార్తెలు రాఖీ, వసుధలను పాఠశాల పీఈటీ నిరంజన్ సింగ్ సహకారంతో రాష్ట్రస్థాయి క్రీడాకారిణులుగా తయారు చేశాడు.
"నా కుమార్తెలు రాఖీ, వసుధకు బాల్యం నుంచే రెజ్లింగ్ నేర్పించేవాడిని. మట్టిలో వారు పోరాడే శక్తిని పరీక్షించేవాడిని. వారికి శిక్షణ ఇచ్చేందుకు నేను వ్యవసాయాన్ని వదిలేశాను. నా పొలాన్నే రెజ్లింగ్ మైదానం చేశాను. కానీ, నా పేదరికం కారణంగా వారికి నేను సరైన శిక్షణ ఇప్పించలేకపోతున్నా. వారికి సరైన ఆహారం ఇవ్వడానికి డబ్బు కావాలి."
- కేసరి
రాఖీ, వసుధకు దేశం కోసం పతకాలు సాధించాలన్న తపన పెరిగింది. అంతర్జాతీయ రెజ్లర్స్ గీత, బబితా ఫొగట్‌ల స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకుపోయారు. రాఖీ రాజస్థాన్ కేసరి-2014 టైటిల్ సాధించింది. ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ టీచర్‌గానూ ఎంపికైంది.
రాఖీ, వసుధ... కబడ్డీ, క్రాస్ కంట్రీ రన్ వంటి క్రీడల్లోనూ సత్తా చాటారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు సాధించారు.
ఎన్ని పోటీల్లో గెలిచినా... సమాజం నుంచి వింత అనుభవాలను ఎదుర్కొనక తప్పలేదు. ఓ సారైతే గ్రామస్థులు తండ్రి కూతుళ్లను వెంబడించి మరీ రాళ్లు రువ్వారు. అయినా వెనకడుగు వేయలేదు. మరింత కఠోర సాధన చేశారు. వారెంటో నిరూపించుకున్నారు.
కేసరి చిన్న కుమార్తెలు మాధవి, తులసి కూడా రెజ్లింగ్ రింగ్‌లోకి దిగారు. అక్కలను మించిపోయి ఆటలో సత్తా చాటారు. కానీ, సరైన సదుపాయాలు లేక పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోతున్నారు. సరైన సౌకర్యాలు కల్పిస్తే తాము కూడా దేశ కీర్తిని ప్రపంచానికి చాటుతామంటున్నారు కేసరీ డాటర్స్.