న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిన వారు, వివిధ కేసుల్లో అరెస్టయి శిక్ష అనుభవించాల్సిన వారికి ఇకపై కరోనా పరీక్షలు కచ్చితంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఆ రాష్ట్ర హైకోర్టు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు నిర్ధరణ అయ్యాకే వారిని జైలుకు తరలించాలని సూచించింది.
జైపుర్ జిల్లా కారాగారంలో అకస్మాతుగా 130 మంది ఖైదీలకు, జైలు సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో.. సుమోటాగా ఈ విషయంపై విచారణ చేపట్టింది జస్టిస్ ఇంద్రజిత్ మహంతి నేతృత్వంలోని ధర్మాసనం. నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ స్థానిక వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
రాజస్థాన్‌లో ప్రస్తుతం అరెస్టయిన నేరస్థులందరి కోసం జైళ్లలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. వారిని 14 నుంచి 21రోజుల పాటు అందులో ఉంచుతున్నారు అధికారులు. వారిని సాధారణ వార్డులకు తరలించడానికి ముందు కచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది ఉన్నత న్యాయస్థానం.
జైళ్లలో ఉండే సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైద్య అధికారులు రోజూ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. తదుపరి విచారణను మే 27కు వాయిదా వేసింది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన వారి గురించి మాత్రం ఎలాంటి సూచనలు చేయలేదు న్యాయస్థానం.