రాజస్థాన్ పురపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 90 స్థానాల్లో... 48 పట్టణాల్లో హస్తం పాగా వేసింది. విపక్ష భాజపా 37 స్థానాలకు పరిమితమైంది.
జనవరి 28న ఈ పట్టణాల్లోని వార్డ్ కౌన్సిళ్లకు ఎన్నికలు జరిగాయి. అదే నెల 31న.. 3,034 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. తాజాగా వీరంతా పురపాలక సంఘాలకు అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
దీని ప్రకారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీలు చెరో పురపాలికను గెలుచుకున్నాయి. మరో మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 19 స్థానాల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించగా.. ఇతరుల మద్దతుతో 48 స్థానాల్లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంది. భాజపాకు 24 స్థానాల్లో సంపూర్ణ మెజారిటీ లభించింది. మొత్తంగా 37 పురపాలికల్లోనే పాగా వేయగలిగింది.
గత ఎన్నికలతో పోలిస్తే భాజపా 23 స్థానాలు కోల్పోగా.. కాంగ్రెస్ 23 స్థానాలను అధికంగా గెలుచుకుంది. చివరిసారి జరిగిన పురపాలిక ఎలక్షన్లలో భాజపా 60 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ 25, స్వతంత్రులు 5 స్థానాల్లో గెలుపొందారు.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్లో జోరుగా సహాయక చర్యలు