రాజస్థాన్‌లోని సీకర్ జిల్లా బాస్ గ్రామానికి చెందిన 91 ఏళ్ల మన్రూప్ జేదూ 'ట్రీ బాబా'గా సుప్రసిద్ధులు. గత 31 ఏళ్లలో 10 వేల మొక్కలను నాటారాయన. ప్రస్తుతం ఆ మొక్కలు పెరిగి పెద్ద చెట్లుగా చల్లని గాలిని ప్రజలకందిస్తున్నాయి. స్వగ్రామంలోనే వెయ్యి మొక్కలను నాటారు బాబా. మొక్కల ఆలనా పాలనా ఆయనే చూశారు.
8 జిల్లాల్లోని 70 గ్రామాల్లో రావి, నిమ్మ, ఇతర చెట్లు నాటారు బాబా. ప్రస్తుతం అవి పెద్దవై ఫలసాయంతో పాటు నీడనిస్తున్నాయి. తన స్వగ్రామంలోని శంసాన్ ఘాట్‌గా పిలిచే ప్రదేశం సహా వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి చెట్లుగా మారాయి. తాను నాటిన మొక్కలకు 91 ఏళ్ల వయస్సులోనూ నీళ్లు పోస్తారు మన్రూప్ బాబా. నీళ్లు పోస్తూనే తన దినచర్యను ప్రారంభిస్తారు.
మన్రూప్ బాబాకు ఆయుర్వేదంలోనూ ప్రవేశం ఉంది. బాబా ఆయుర్వేద మొక్కలను కొనుగోలు చేసి గ్రామంలో నాటుతుంటారు. ఇందుకు ఆయన ఎవరి నుంచీ ఎలాంటి సహాయం తీసుకోరు.
చెట్లు పెంచాలనే ప్రేరణ తనకు 31ఏళ్ల క్రితమే కలిగిందని తెలిపారు బాబా. అప్పుడు కొంత మంది పెద్ద పెద్ద చెట్లు నరుకుతుంటే వద్దని చెప్పినా వినలేదని, అప్పటి నుంచే గ్రామమంతా మొక్కలు నాటుతున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: తండ్రి గౌరవం ముందు డబ్బు గడ్డిపరకైంది!