ఉత్తరప్రదేశ్‌ను వర్షాలు కుదిపేస్తున్నాయి. గత తొమ్మిది రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జులై 3 నుంచి 11వ తేదీ వరకు కురిసిన వర్షాలకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఫతేపుర్‌లో ముగ్గురు.. వర్షాలకు బలయ్యారు. మహోబా, పిలిభిత్, కాన్పూర్ దేహత్, సోంభద్రా, హర్దోయ్, కుషీనగర్, ప్రతాప్‌గఢ్, సితాపుర్, కన్నౌజ్, బారాబంకీ, జాన్పుర్లో ఒక్కొక్కరు మృతిచెందారు.
రాష్ట్రవ్యాప్తంగా గంగా, యమున, శారదా, గోమతి, రామ్‌గంగా, రాప్తితో పాటు ఇతర నదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ప్రకటించారు.
హతా, రామ్‌నగర్‌లో 15 సెంటీమీటర్లు, ఫతేపుర్‌లో 11, బల్రామ్పుర్, గోరఖ్‌పుర్‌లో 10, షాజాన్‌పుర్, హైదర్ఘాట్, ఎలిజిన్బ్రిడ్జ్ ప్రాంతాల్లో 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.