తరుముకొస్తున్న 'మహా' తుపాను కారణంగా మహారాష్ట్రలోని ఠాణె, పాల్ఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన వానలకు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగినట్లు జిల్లా విపత్తు నిర్వహణ విభాగ (డీడీఎంసీ) అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. దహను.. సముద్ర తీర గ్రామాలు, పాల్ఘర్ జిల్లాలోని చిన్చాని, బోయిసర్, సఫాలే, కెల్వే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు.
వాణిజ్య రాజధాని ముంబయి నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
గడిచిన 24 గంటల్లో ఠాణె జిల్లాలో రికార్డు స్థాయిలో 59.94 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం ఈ వర్షాకాలంలో 4565.10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొలాబా అబ్జర్వేటరీలో 0.2 మి.మీ, శాంట్క్రూజ్లో 32.6 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఈ విధంగా వర్షపాతం నమోదైనప్పటికి రవాణా వ్యవస్థ ఎక్కడ స్తంభించలేదని అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన 'మహా' తుపాను గుజరాత్ తీరం వైపు ప్రయాణిస్తుంది. ఈ తుపాను వల్ల మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.