మహారాష్ట్ర- ముంబయిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ శివారు ప్రాంతాల్లో రహదారులు, రైల్వే స్టేషన్లోని రైల్వే ట్రాక్లు నీటమునిగాయి. ఫలితంగా సబర్బన్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
థానే-కాసర, థానే-కర్జాత్ , వాషి- పాన్వేల్ పరిధిలో పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ఇతర రైళ్లను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. బుధవారం 5:30 గంటల వరకు శాంతాక్రజ్ లో 27.36, కొలాబాలో 12.22 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించారు.
ఇదీ చదవండి: పర్యావరణ విధ్వంసానికేనా అనుమతులు?