దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాల్ని నిలిపివేశాయి ఆయా ప్రభుత్వాలు. అయితే కొన్ని మినహాయింపులతో గూడ్స్ రైళ్లు, అత్యవసర, నిత్యావసర వస్తువుల సరఫరా చేసే వాహనాలు ప్రస్తుతం పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రెండు ప్రత్యేక రైళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
సైనికుల కోసమేనా..!
బెంగళూరు, బెళగావి, సికింద్రాబాద్, గోపాల్పుర్లోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను.. ఉత్తర, ఈశాన్య సరిహద్దులకు తరలించేందుకు ఈ రెండు రైళ్లు నడపాలని రైల్వే శాఖను కోరింది భారత సైన్యం. ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం.
"ఉత్తర, ఈశాన్య సరిహద్దుల్లో కార్యకలాపాల నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల్లోని సైనికులను ఆయా సరిహద్దులకు తరలించేందుకు.. రైల్వే శాఖ సాయంతో రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా మొదటి రైలు ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి బయల్దేరి జమ్మూకు చేరుకుంటుంది. రెండో రైలు ఏప్రిల్ 18న బెంగళూరు నుంచి గువహటికి బయల్దేరుతుంది. సరిహద్దుల్లో మొహరించిన బలగాల సన్నద్ధతకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఉత్తర, ఈశాన్య సరిహద్దుల్లో మొహరించిన సిబ్బందిలో ఎవరైనా క్వారంటైన్‌లో ఉండి తిరిగి విధుల్లో చేరితే వారికి ప్రత్యేక వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం’"
- భారత సైన్యం
ఇదీ చదవండి:మే 3 వరకు రైళ్లు లేవ్... విమానాల్లేవ్