ఏసీ ప్రత్యేక రైళ్లకు సంబంధించి తీసుకొచ్చిన పలు మార్పులపై రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా 15 జతల (30 రైళ్లు) ఏసీ ప్రత్యేక రైళ్ల బుకింగ్‌లో రైల్వే శాఖ కొన్ని మార్పులు చేసింది.
టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 7 రోజులకు బదులు 30 రోజులకు పెంచింది. ఈ ప్రత్యేక రైళ్లకు ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కూడా జారీ చేయనున్నట్లు పేర్కొంది. అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులకు టికెట్టు కన్ఫర్మ్ అయితేనే ప్రయాణించే వీలుంటుందని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి ప్రతిరోజు 200 సాధారణ రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు ఇటీవలె ప్రకటించింది.
చార్ట్ తయారీలో..
ప్రయాణికుల చార్ట్ తయారీ సమయాల్లోనూ రైల్వే శాఖ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. రైలు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు మొదటి చార్ట్, 2 గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ప్రయాణ సమయానికి 30 నిమిషాల ముందు చార్ట్ విడుదల చేయాలనే నిబంధనను తొలగించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లకు రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్ల నుంచి కూడా టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది.
మే 24 నుంచే..
పోస్టాఫీస్, ప్యాసింజర్ టికెట్ ఫెసిలిటేషన్, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్, కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తాజా మార్పులు మే 24 తర్వాత అమల్లోకి వస్తాయని.. మే 31 నుంచి నడిచే ఏసీ ప్రత్యేక రైళ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఇదీచూడండి: పామును ముక్కలు చేసి.. త్రిశూలానికి గుచ్చి!