సార్వత్రిక ఎన్నికల ఐదో దశ ముందు సొంత నియోజకవర్గం అమేఠీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ రాశారు. సమస్యలను ఎదుర్కొనే శక్తిని అమేఠీ ప్రజల నుంచే పొందానని పేర్కొన్నారు. అమేఠీలో భాజపా ప్రభుత్వం అడ్డుకున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
" కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే భాజపా అడ్డుకున్న అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని అమేఠీ ప్రజలకు హామీ ఇస్తున్నా. మీ కుటుంబంలోని వ్యక్తిని తిరిగి గెలిపించేందుకు మే 6న పెద్ద సంఖ్యలో ఓట్లు వేయండి. " - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.
ఎన్నికల సమయంలో భాజపా చెప్పే అబద్ధాలను అమేఠీ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు రాహుల్. నిజాయతీ, సమగ్రతలు అమేఠీ ప్రజల బలమన్న విషయం కాషాయపార్టీకి తెలియదన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలే యజమానులని తెలిపారు. కానీ భాజపా పాలనలో ధనిక వ్యాపారులే యజమానులని ఆరోపించారు.
రాహుల్ గాంధీ లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్టు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి అన్షు అవస్థి తెలిపారు. అధ్యక్షుడి సందేశాన్ని అమేఠీలో గడప గడపకు చేరవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: "రాహుల్‌ను ఎత్తుకున్న మొదటి వ్యక్తిని నేనే"