ఆర్బీఐ నుంచి కేంద్రం చోరీ చేస్తోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 'దొంగతనం' అంటూ రాహుల్ పదేపదే చేసే ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
"రిజర్వ్ బ్యాంక్ విశ్వసనీయతపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకే ఓ కమిటీని ఏర్పాటుచేసింది. వారికి వారే స్వతంత్రంగా ఓ విధాన నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాంటి నిర్ణయంపైనే ప్రశ్నలు ఉత్పన్నమవడం బాధిస్తోంది.
రాహుల్ గాంధీ 'దొంగ- దొంగ- దొంగతనం' అనే వ్యాఖ్యలు చేసినప్పుడు నాకు ఒకటే గుర్తుకు వస్తోంది. వారికి ప్రజలు ఇప్పటికే సరైన సమాధానం చెప్పారు. ఓటమి తర్వాత కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి డబ్బులు దొంగిలించారని ఆరోపించే ముందు వారి ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వారితో చర్చించాలి."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి
ఇదీ చూడండి: 'ఆర్బీఐ నుంచి సర్కారు డబ్బు దొంగతనం'