కేంద్ర హోంమంత్రి అమిత్షా విపక్ష కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు. పౌరచట్ట సవరణపై దేశంలోని మైనారిటీలను కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దిల్లీ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పౌరచట్ట సవరణ అనంతరం నాలుగు రోజుల పాటు చెలరేగిన అల్లర్లకు ఆ రెండు పార్టీలే బాధ్యత వహించాలన్నారు.
"పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన శరణార్థులకు ఆశ్రయం కల్పించాలా వద్దా.. వారికి పౌరసత్వం కల్పించేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దేశంలోని మైనారిటీలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీ పౌరచట్ట సవరణ ద్వారా పౌరసత్వం రద్దు అవుతుందని వెల్లడిస్తున్నారు. మీరు పౌరులు కాబోరని భయపెడుతున్నారు. పౌరచట్ట సవరణలో ఎవరి పౌరసత్వాన్ని తొలగించే అంశం లేదు. పౌరసత్వం ఇచ్చే అంశమే ఉంది. మీరు అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు.?"
-అమిత్షా, కేంద్ర హోం మంత్రి
జేఎన్యూ అల్లర్లపై...
జేఎన్యూలో ఆదివారం రాత్రి తలెత్తిన అల్లర్లపై పరోక్షంగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నవారిని అరెస్టు చేయకుండా పోలీసులను.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: '2022 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా పవార్'